వారికి మళ్లీ JEE అడ్వాన్స్ పరీక్షకు అవకాశం

కరోనా కారణంగా 2020, 2021లో JEE అడ్వాన్స్ పరీక్ష రాయలేకపోయిన అర్హులైన విద్యార్థులకు జాయింట్ అడ్మిషన్స్ బోర్డు (JAB) 2022లో పరీక్ష రాసేందుకు అనుమతిస్తున్నట్టు ప్రకటించింది.

వీరు మళ్లీ JEE మెయిన్ – 2022కు హాజరు కావాల్సిన అవసరం లేదని, నేరుగా అడ్వాన్స్ హాజరవ్వొచ్చని తెలిపింది. ఇందుకు ఆన్లైన్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకొని, ఫీజు చెల్లించాలని స్పష్టం చేసింది.

2020 బ్యాచ్ అభ్యర్థులకు సంబంధించి.. 2020, 2021లలో ఒక్కసారే పరీక్షకు హాజరైన వారు లేదా అసలు హాజరుకాని వారు ఈ జేఈఈ అడ్వాన్స్-2022 అదనపు అవకాశానికి అర్హులని,

2020, 2021 రెండు సంవత్సరాల్లో పరీక్ష రాసిన వారు మూడో అటెంప్ట్ కు అనర్హులని జేఏబీ స్పష్టం చేసింది. దీంతో 2022 జేఈఈ అడ్వాన్స్ కు అర్హత సాధించిన 2.5 లక్షల మందిపై ఎటువంటి ప్రభావం చూపదని, ఈ అవకాశాన్ని వినియోగించుకునే విద్యార్థులను అదనపు సంఖ్యగా పరిగణిస్తామని పేర్కొన్నది. 2023 బ్యాచ్ నుంచి జేఈఈ సిలబస్ లో మార్పు చేయబోతున్నట్టు జేఏబీ వెల్లడించింది.