భారీగా ఇంటర్ రీవెరిఫికేషన్ దరఖాస్తులు

ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం జవాబు పత్రాల రీవెరిఫికేషన్ కు ఈసారి భారీగా 38,085 దరఖాస్తులు అందాయి. పునఃపరిశీలనకు గడువు బుధవారంతో ముగిసింది. ఇంకా పునఃలెక్కింపునకు 4,007 మంది ఫీజు కట్టారు. అవి కేవలం తొలి ఏడాదికి మాత్రమే కావడం గమనార్హం.

గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఇంటర్‌ ఫస్టియర్‌లో 49 శాతం మందే ఉత్తీర్ణులు కావడంతో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవచ్చన్న ఆశతో విద్యార్థులు జవాబుపత్రాల పునఃపరిశీలనకు దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు. ఈ నెల 20 నాటికి 12,294 దరఖాస్తులు రాగా.. మంగళవారం నాటికి 22వేల మందే ముందుకొచ్చారు. ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోకపోవడంతో చివరి రోజు బుధవారం సుమారు 15 వేల వరకు దరఖాస్తు చేశారు.