నూతన జోనల్ ప్రకారం ఉద్యోగుల విభజన : కేసీఆర్

ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రారంభమైన జిల్లా కలెక్టర్ల సమావేశం. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నూతన జోనల్ వ్యవస్థ నియమ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజనను చేపట్టాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. ఈ జోనల్ వ్యవస్థతో స్థానిక యువతకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని, క్షేత్ర స్థాయిలోకి ప్రభుత్వ పాలన అమలులోకి వస్తుందని సీఎం తెలిపారు. వెనకబడిన మారుమూల ప్రాంతాల్లోకి కూడా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పనిచేయగలిగితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని సీఎం అన్నారు. నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేసి నివేదికను అందజేయాలన్నారు.

ఉద్యోగులయిన భార్యాభర్తలు (స్పౌస్ కేస్) ఒకే చోట పనిచేస్తేనే ప్రశాంతంగా పనిచేయగలుగుతారని, ఉత్పాదకత కూడా పెరుగుతుందని సీఎం తెలిపారు. స్థానిక యువత ఉద్యోగాలకు విఘాతం కలగకుండా మానవీయ కోణంలో స్పౌస్ కేస్ అంశాలను పరిష్కరించాలని సీఎం తెలిపారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో యాసంగి వరి ధాన్యం కొనబోమని పదే పదే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో ఒక్క కిలో వడ్లు కూడా కొనలేదని, రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోవడం లేదని సీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర విధానాల నుంచి రాష్ట్ర రైతాంగాన్ని కాపాడేందుకు క్షేత్రస్థాయిలో ధాన్యం కొనబోమనే విషయాన్ని అర్థం చేయించాలని సీఎం కలెక్టర్లను, వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు.

తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దార్శనిక వ్యవసాయ విధానాలు స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం అమలు చేయలేదని సీఎం అన్నారు. వీటిని కొనసాగిస్తామని స్పష్టం చేసారు. రాబోయే వానాకాలం పంటల సాగుపై ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అన్నారు. వానాకాలంలో ప్రధానంగా పత్తి, వరి, కంది సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్లను, వ్యవసాయశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. రైతులను ప్రత్యామ్నాయ లాభసాటి పంటల సాగు దిశగా సమాయత్తం చేయాలన్నారు.