కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై చర్యలు తీసుకోండి : గాదె వెంకన్న

  • విద్యా శాఖ మంత్రి, పల్లా రాజేశ్వర్ రెడ్డి లకు ఆర్జెడి నియమిత కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం వినతి
  • సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళతామని హమీ ఇచ్చిన సబితాఇంద్రారెడ్డి, పల్లా

రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ఇటీవల రాష్ట్ర ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 16 ను అమలు చేస్తూ త్వరితగతిన కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్జెడి నియమిత కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గాదె వెంకన్న, కుమార్ ల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మరియు శాసనమండలి సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి లను వేర్వేరు సందర్భాల్లో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా గాదె వెంకన్న మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలకు పైగా గత ప్రభుత్వాలు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేస్తామని హామీలు ఇచ్చి మోసం చేయడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర సహకారంతో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోగా కొంతమంది న్యాయస్థానం ఆశ్రయించి ప్రక్రియను అడ్డుకోవడం వల్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ ఆలస్యమైందని అన్నారు. ఇటీవల హైకోర్టు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కు వ్యతిరేకంగా వేసిన ప్రజా వ్యాజ్యాన్ని కొట్టివేసిన సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు మీద పూర్తి నమ్మకం ఉందని వారు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో మాట్లాడి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కృషి చేస్తానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరియు పల్లా రాజేశ్వర్ రెడ్డి హమీ ఇచ్చారని గాదె వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమార్, రాష్ట్ర నాయకులు యుగేందర్, కోటేశ్వరరావు, రామ్మోహన్, తిరుపతి, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.