రికార్డు స్థాయి ఇంటర్మీడియట్ అడ్మిషన్ల నమోదు పట్ల గెస్ట్ లెక్చరర్ల సంఘం హర్షం

  • ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య
  • జూనియర్ కాలేజీ గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్

తెలంగాణ రాష్ట్రం లోని 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ 2021-22 విద్యాసంవత్సరంలో మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో దాదాపు 1.10 లక్షల అడ్మిషన్లకు పైగా నమోదు కావడం పట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలల గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ లు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో ఇంటర్మీడియట్ బోర్డు కమీషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ సారథ్యంలో 1 లక్షకు పైగా అడ్మిషన్లు నమోదు కావడం చాలా సంతోషకరమని… కరోనా విపత్కర పరిస్థితుల కారణంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనే ఉచిత, సురక్షిత, నాణ్యమైన విద్య లభిస్తుందని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు సైతం విశ్వసించి ప్రభుత్వ కళాశాల్లో ప్రవేశాలు పొందారని అన్నారు. ఇంటర్ బోర్డు పరిధిలో పని చేస్తున్న అన్ని వ్యవస్థలు, విభాగాల కృషి ఫలితంగానే లక్ష అడ్మిషన్ల లక్ష్యాన్ని చేరుకోగలిగామన్నారు.

ముఖ్యంగా.. 2021-22 విద్యాసంవత్సరం ప్రారంభం రోజు నుండే అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పాత గెస్ట్ లెక్చరర్లను కొనసాగింపు చేసి, కొత్తగా ఏర్పడిన ఖాళీలలో నూతన గెస్ట్ లెక్చరర్ల నియామకం చేపట్టి ఉంటే అడ్మిషన్ల సంఖ్య మరింత రెట్టింపయ్యేదని ఆశాభావం వ్యక్తం చేశారు. అయినా కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇదివరకే పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లు స్వచ్చందంగా వారి వారి కళాశాలల్లోని ప్రిన్సిపాల్స్ మరియు లెక్చరర్స్ యొక్క సహకారంతో అడ్మిషన్ డ్రైవ్ లలో పాల్గొని వారి వారి గ్రూపులలో అడ్మిషన్ల సంఖ్య పెరగడానికి తమ వంతు కృషి చేశారని తెలిపారు.

ఈ క్రమంలో వచ్చే 2022-23 విద్యాసంవత్సరం లోనైనా ప్రారంభం రోజు నుండే వ్యవస్థలో నున్న తాత్కాలిక లెక్చరర్లతో పాటూ.. పాత గెస్ట్ లెక్చరర్లనూ యధావిధిగా కొనసాగించినట్లయితే మరింత రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తూ.. ప్రభుత్వ కళాశాలల అభివృద్ధి కి పాటు పడటమే గాక, ప్రవేశాల సంఖ్య రెట్టింపు చేయడంలో తప్పనిసరిగా కీలకపాత్ర పోషిస్తామని తెలియజేశారు. ఆ దిశగా.. విద్యాశాఖ మంత్రి వర్యులు, ఇంటర్ బోర్డు కమీషనర్ చొరవ తీసుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాలని సూచించారు.