సీజేఎల్స్ జీతాలు చెల్లించండి మహా ప్రభో – రెమిడి మల్లారెడ్డి

  • నాలుగు నెలలుగా వేతనాలు లేవు
  • బదిలీలపై సీఎం హామీ హామీగానే మిగిలింది
  • కాంట్రాక్టు లెక్చరర్ల అధ్యక్షులు రేమిడి మల్లారెడ్డి

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల వేతనాల చెల్లింపు ఆలస్యం పట్ల కాంట్రాక్టు లెక్చరర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు రేమిడి మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రోజున ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 153 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పని చేస్తున్నారని వారికి ఫిబ్రవరి మాసం నుండి వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని తెలిపారు

కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చిన ఈ తరుణంలో చేతిలో చిల్లిగవ్వ లేకుండా కుటుంబాన్ని పోషించడం చాలా ఇబ్బంది అవుతుందన్నారు. చాలా మంది కాంట్రాక్టు లెక్చరర్లు మరియు వారి కుటుంబ సభ్యులు కరోనా వైరస్ బారిన పడ్డారని అందుకు కావలసిన వైద్య సహాయాన్ని పొందడానికి ఆర్థిక స్థోమత లేక తనువు చాలించిన పరిస్థితి కాంట్రాక్టు లెక్చరర్లకు ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చరర్లకు నెలనెలా వేతనాలు చెల్లిస్తామని అనేక పర్యాయాలు హామీ ఇచ్చారని అట్టి హామీ కేవలము రాజకీయ హామీగానే మిగిలిందని అమలుకు నోచుకోలేదు అన్నారు.

అదేవిధంగా తమ స్వస్థలాలకు దూరంగా కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు బదిలీలు చేస్తామని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ సమీక్షలో నిర్ణయం తీసుకున్నారని దాని అమలులో విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. కావున ప్రభుత్వము వెంటనే పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లించాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన బదిలీల హామీ ప్రకారం విద్యాశాఖ అధికారులు కాంట్రాక్టు లెక్చరర్ల బదిలీలను విద్యాసంవత్సరం ప్రారంభంలోగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి కాంట్రాక్టు లెక్చరర్ల జీవితాలను ఆదుకోవాలని రేమిడి మల్లారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.