యాప్ లో ఇంటర్ స్టడీ మెటీరియల్, త్వరలో ఆన్లైన్ తరగతులు

తెలంగాణ లోని ఇంటర్మీడియట్ విద్యార్థులు టీవీల ద్వారా డిజిటల్, ఆన్లైన్‌ పాఠాలను వింటూనే సులభంగా వాటిని అర్థం చేసుకొని చదువుకునేందుకు వీలుగా పీడీఎఫ్‌ రూపంలో మెటీరియల్‌ను ప్రత్యేక యాప్ లో అందించాలని ఇంటర్‌బోర్డు యోచిస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తి చేసింది.

గతేడాది అధ్యాపకులతో ముందుగా పాఠాలను రికార్డు చేయించి వాటిని సెప్టెంబరు 1 నుంచి దూరదర్శన్‌ ద్వారా ప్రసారం చేశారు. ఈసారి వాటితోపాటు ఆయా పాఠ్యాంశాలకు సంబంధించి ప్రశ్నలు-జవాబులు, ముఖ్యాంశాలను పీడీఎఫ్‌ రూపంలో తయారు చేయిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించి అందులో ఉంచుతారు. వాటిని విద్యార్థులు ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకోవచ్చు. అంతేకాకుండా ఎంత మంది ఏయే పాఠాలు, ఎంత సమయం చదివారు లాంటి వివరాలను కూడా యాప్‌ ద్వారా తెలుసుకునేలా ఉండాలన్నది ఆలోచిస్తున్నారు.

త్వరలోనే ఆన్లైన్/డిజిటల్ తరగతులు ::

కార్పొరేట్‌తోపాటు మరికొన్ని ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలతో పోటీపడేందుకు ఈసారి ప్రభుత్వ కళాశాలల్లో గతంలో కంటే రెండు నెలల ముందుగా ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభించాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో పాటు నెలాఖరు వరకు వేసవి సెలవులు ఉన్నందున జూన్‌ 1న నిర్వహించే సమీక్ష సందర్భంగా తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జూన్‌ నెలాఖరులో పరీక్షలు జరపాలని భావిస్తున్నారు. అదే ఖరారైతే అవి ముగిసిన వెంటనే ఆన్‌లైన్‌ తరగుతులు మొదలుపెట్టే అవకాశం ఉంది.