కరోనా భారీ నుంచి కోలుకున్న వారిని ప్రస్తుతం వేధిస్తున్న మరో సమస్య బ్లాక్ ఫంగస్. దేశంలో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటికే దీంతో 90 మంది మరణించారు. రాజస్థాన్‌లో 100కు పైగా కేసులు నమోదవడంతో దీనిని అంటువ్యాధుల జాబితాలో చేర్చారు. ఈ నేపథ్యంలో డిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) బ్లాక్ ఫంగస్‌ను ఎదుర్కొనేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది.
★ ముప్పు ఎవరికి ఎక్కువ::
● మధుమేహం అదుపులో లేనివారు, బాగా స్టెరాయిడ్స్ తీసుకొనేవారు
● రోగ నిరోధక మందులు, యాంటీ క్యాన్సర్ చికిత్స తీసుకొనేవారు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నవారు
● చాలా కాలంపాటు స్టెరాయిడ్స్ తీసుకొనేవారు
● కరోనా తీవ్రమై, ఆక్సిజన్ వెంటిలేటర్ సపోర్టుతో ఉండి, కోలుకున్న వారికి బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ వచ్చే ముప్పు ఉంటుందని ఎయిమ్స్ వెల్లడించింది. బాధితులు వైద్యుల సలహాతో తరచూ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది.
★ బ్లాక్ ఫంగస్ లక్షణాలు ::
ఎవరికి వారు తరచుగా ముఖాన్ని పరీక్షించుకోవాలని ఎయిమ్స్ సూచించింది. ముఖంలో వాపు రావడం, కంటి కింద, ముక్కు, చెంపల భాగాల్లో నలుపు రంగు ఉందేమో చూసుకోవాలి. ఎక్కడైనా ముట్టుకుంటే నొప్పి వస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
● ముక్కు నుంచి నల్లటి స్రావాలు, రక్తం కారడం
● ముక్కు మూసుకుపోవడం, తలనొప్పి, కంటినొప్పి, కంటి చుట్టూ వాపు, ఎర్రగా అవడం, దృష్టి కోల్పోవడం, కన్ను మూసి తెరవడంలో ఇబ్బందులు
● ముఖం తిమ్మిరిగా అనిపించడం
● నోరు తెరవడం, నమలడంలో సమస్యలు
● దంతాలు వదులుగా అనిపించడం, నోటి లోపలి ప్రాంతాల్లో వాపు
★ ఇన్ఫెక్షన్ ఉన్నపుడు ఏం చేయాలి
● వెంటనే చెవి- ముక్కు- గొంతు(ఈఎన్టీ) వైద్యులను సంప్రదించాలి
● రక్తంలో గ్లూకోజ్‌ను పరిశీలిస్తూ, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలి.
● వైద్యులు సూచించిన ఔషధాలనే వాడాలి. సొంతవైద్యం చేసుకోకూడదు.
● వైద్యుల సూచన మేరకు అవసరమైనపుడు మాత్రమే ఎమ్మారై, సీటీ స్కాన్లు చేయించాలి