పదవ తరగతి పరీక్షలు రద్దు

కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మే 17 నుండి జరగాల్సిన పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే (సీబీఎస్ఈ) పదోతరగతి పరీక్షలను రద్దు చేయగా, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే అకాడమిక్ ఇయర్ పై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రతను దృష్టి పెట్టుకుని పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అయితే పదవ తరగతి విద్యార్థులకు మార్కులను SSC బోర్డు తయారు చేసిన ఆబ్జెక్టివ్ పద్ధతిలో వేయనున్నారు. ఈ మార్కుల మీద సంతృప్తి గా లేని విద్యార్థులు భవిష్యత్తులో పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు పరీక్షలు వ్రాసే అవకాశం ఉంటుందని తెలిపారు.