తెలంగాణ ప్రభుత్వ “కరోనా” ఆంక్షలు

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాలు, ప్రజా రవాణా వాహనాల్లో మాస్కుల వినియోగం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. మాస్కులు ధరించని వారిపై విపత్తు నిర్వహణ చట్టం, ఐపీసీ కింద చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ర్యాలీలు, ఒకేచోట ప్రజలు గుంపులుగా ఉండటంపై ఆంక్షలు విధించింది. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఎలాంటి ర్యాలీలు, ఉత్సవాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది.

బహిరంగ ప్రదేశాలు, స్థలాలు, పార్కుల్లో ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని పేర్కొంది. హోలి, ఉగాది, శ్రీరామనవమి, మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే, రంజాన్ తదితర సందర్భాల్లో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలను నిర్వహించరాదని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిబంధనలు విధిగా అమలయ్యేలా చూడాలని రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది.