జూనియర్ గెస్ట్ లెక్చరర్ల సమస్యల పరిష్కారం పల్లా తోనే సాధ్యం – దార్ల భాస్కర్

వరంగల్ – నల్గొండ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా రెండోసారి గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల అతిథి అధ్యాపకుల సంఘం నాయకులు గురువారం నాడు హైద్రాబాదులోని పల్లా నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్బంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ పల్లా తో మాట్లాడుతూ.. గెస్ట్ లెక్చరర్ల కొనసాగింపుకై పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన కృషి అభినందనీయమని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1500 మంది గెస్ట్ లెక్చరర్ల తరపున కృతజ్ఞతలు తెలిపారు.

ఎమ్మెల్సీ ఎన్నికలలో పల్లాకు మద్దతు ఇచ్చి వారి గెలుపుకై గెస్ట్ లెక్చరర్ల సంఘం నాయకులు తీవ్రంగా శ్రమించినట్లు గుర్తు చేశారు. ఈ క్రమంలోనే గెస్ట్ లెక్చరర్లకు ఈ విద్యాసంవత్సరం పూర్తి బడ్జెట్ విడుదల చేయాలని, పీరియడ్లతో సంబంధం లేకుండా వేతనాలను అందించే విధంగా సహకరించాలని, ప్రతీ సంవత్సరం రెన్యూవల్ ఇబ్బందులు తలెత్తకుండా ఇంటర్మీడియట్ వ్యవస్థలో పనిచేసే ఇతర తాత్కాలిక ఉద్యోగుల మాదిరిగానే విద్యాసంవత్సరం ప్రారంభం నుండే ఆటో రెన్యూవల్ అయ్యే విధంగా చూడాలని కోరారు.

సమస్యలను సావధానంగా విన్న పల్లా స్పందిస్తూ..వీలైనంత త్వరగా సంబంధిత కార్యదర్శి, విద్యాశాఖ మంత్రితో మాట్లాడి అన్ని సమస్యలపై చర్చించి పరిష్కారం అయ్యేలా చూస్తానని, ఎన్నికలలో తన గెలుపుకోసం కష్టపడిన గెస్ట్ లెక్చరర్ల సంఘం నాయకులను అభినందించి, ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్, రాష్ట్ర నాయకులు ఎం బాబురావు, కే మహేష్ కుమార్, ఎస్. వెంకటేష్, ఎల్. శ్రీకాంత్, ఇస్సాక్, జిల్లా నాయకులు బి. కృష్ణ, ఈ సైదులు, భానుప్రకాష్, హెచ్. శ్రీకాంత్, సత్యనారాయణ, స్వామి, కే. అంజయ్య, ఎన్. కిరణ్ కుమార్, ఎం. భిక్షపతి, ఏ. రమేష్, ఎం. రఘు తదితరులు పాల్గొన్నారు.