దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ర్టంలో పాఠశాలల తరగతులు కొనసాగించాలో.. సెలవులు ఇవ్వాలో అనే అంశంపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.
ఇప్పటికే రెసిడెన్షియల్ హాస్టల్స్, కొన్ని పాఠశాలల్లో కరోనా వ్యాప్తి చెందింది. మన పిల్లలను మనమే చెడుగొట్టుకోవద్దు. పిల్లల భవిష్యత్ దృష్ట్యా ఈ రెండు, మూడు రోజుల్లో తానే స్వయంగా పాఠశాలల నిర్వహణపై శాసనసభ వేదికగా ప్రకటన చేస్తానని చెప్పారు. కరోనాను కంట్రోల్ చేసేందుకు వైద్యాశాఖ అధికారులు తీవ్రమైన కసరత్తు చేస్తోందన్నారు.
గత వారం రోజుల నుంచి రాష్ర్టంలో కరోనా పెరుగుదల కనిపిస్తుంది. కరోనా వ్యాప్తిపై కన్నేసి ఉంచాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరిస్తోంది. దేశం పరిస్థితి కంటే మన రాష్ర్టం పరిస్థితి మెరుగ్గా ఉంది. కొన్ని గురుకుల హాస్టళ్లల్లో, మంచిర్యాల పాఠశాలలో కొన్ని కరోనా కేసులు ఎక్కువ వచ్చాయి. కేంద్రం నుంచి కూడా ఎప్పటికప్పుడు సూచనలు వస్తున్నాయి. అన్ని శక్తులను ఉపయోగించి కరోనాను అదుపులో ఉందచేందుకు యత్నిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.