పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే ఆలోచన లేదు – నిర్మలా సీతారామన్

పెట్రో ధరలు రికార్డు స్ధాయికి చేరి సామాన్యుడికి భారమైన క్రమంలో జీఎస్టీ ప‌రిధిలోకి ముడిచమురు, పెట్రోల్‌, డీజిల్‌, జెట్‌ ఫ్యూయల్‌, సహజ వాయువులను తీసుకువచ్చే ఆలోచన ప్రస్తుతం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో శుక్రవారం ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో స్పష్టం చేశారు.

అలాగే రాష్ట్రాలు కూడా ప్రాతినిథ్యం వహిస్తున్న జీఎస్టీ కౌన్సిల్‌లో ఇప్పటివరకూ పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఎవరూ సిఫార్సు చేయలేదని చెప్పారు. అయితే ఈ ఐదు పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి చేర్చే ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్‌ పరిశీలించవచ్చని వ్యాఖ్యానించారు.