జూనియర్ అతిధి అధ్యాపకుల సమస్యలు పరిష్కారిస్తాం – హరీష్ రావు

తెలంగాణ రాష్ట్రంలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్టు మరియు అతిథి అధ్యాపకులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అతిథిగా హాజరు కావడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్న దాదాపు 1500 మంది అతిధి అధ్యాపకుల తరపున అతిథి అధ్యాపకుల సంఘం ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా షేక్ యాకుబ్ పాషా మాట్లాడుతూ కరోనా కారణంగా జూనియర్ కళాశాలలో తెరుచుకోకపోవడంతో తమను ఈ సంవత్సరం జూన్ నుండి రెన్యూవల్ చేయలేదని, కళాశాలలు భౌతికంగా తెరుచుకున్న ఫిబ్రవరి మొదటి తేదీ నుంచి తాము కళాశాలలకు హాజరవుతున్నామని తెలియజేసి, తమను జూన్ నుండి రెన్యూవల్ చేయాలని అలాగే సంవత్సర కాలంగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలియజేసి, జూన్ నుంచి వేతనాలు చెల్లించాలని విన్నవించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం ఇప్పటికే అతిథి అధ్యాపకుల రెన్యూవల్ పై ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకున్నామని, పది నెలల వేతనాలకు సంబంధించి త్వరలోనే బడ్జెట్ విడుదల చేస్తామని మరియు ఇతర సమస్యలను తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని తెలియజేశారని అతిథి అధ్యాపకుల సంఘం నాయకుడు యాకుబ్ పాష ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమంలో అతిథి అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ యాకుబ్ పాషా, హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ షేక్ బిలాల్ హైదరాబాద్ కార్యవర్గ సభ్యులు హుషాప్, నాగేశ్వరరావు, జగన్, భాగ్యరేఖ, ప్రభావతి, మంజుల, బషీరుద్దీన్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్యామ్, నాగర్ కర్నూల్ జిల్లా సెక్రెటరీ సదానందం గౌడ్, వనపర్తి జిల్లా సెక్రెటరీ బాలకృష్ణ, నరసయ్య, భీమేష్, గిరి, శాలిని, కవిత, బాలరాజు, శ్రీను మొదలగు వారు పాల్గొన్నారు.