ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కోసం పీఆర్టీయూ ఉద్యమ బాట.

గత ఐదున్నర సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మరియు పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించకపోవడంతో ప్రభుత్వ విద్యా రంగం నిర్వీర్యం అవుతున్న దృష్ట్యా వెంటనే పదోన్నతుల షెడ్యూల్ను విడుదల చేయాలని లేనిపక్షంలో ఈనెల 9వ తేదీ నుండి జిల్లా కేంద్రాలలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని PRTU – TS మరియు ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్ మరియు కూర రఘోత్తం రెడ్డిలు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈరోజు హైదరాబాద్ లో సంఘం యొక్క జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో అత్యవసర సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు పదోన్నతులు లేక 20 సంవత్సరాలుగా ఒకే కేడర్ లో పని చేస్తూ రిటైర్ అవుతున్నారని వాపోయారు.

అలాగే ప్రభుత్వానికి పీఆర్సీ నివేదిక అంది నెల రోజులు గడుస్తున్నా, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెంటనే 45 శాతం వేతన స్కేల్ అమలు చేస్తూ పీఆర్సీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే పెండింగ్ లో ఉన్న పండిట్, పీఈటీల అప్గ్రేడేషన్ జీవోను అమలు చేయాలని, పాఠశాలలో స్కావేంజర్ ను నియమించాలని, అంతర్ జిల్లా బదిలీలు షెడ్యూల్ ను వెంటనే విడుదల చేయాలని, కేజీబీవీ, మోడల్ స్కూల్ టీచర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు, చెన్నకేశవరెడ్డి, ముజీబర్ రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.