కరోనా కారణంగా ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జూనియర్ కళాశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో, కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఇంటర్ బోర్డు కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు.
విద్యార్థులు కళాశాలలకు రావడం తప్పనిసరి కాదని, తరగతులకు హాజరుకాకుండా నేరుగా పబ్లిక్ పరీక్షలు వ్రాసినా రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు బోర్డు తీసుకున్న నిర్ణయాలు, సిలబస్, తరగతులు, పరీక్షల నిర్వహణకు సంబంధించిన అంశాలను ఇంటర్మీడియట్ కమీషనర్ ఉమర్ జలీల్ వివరించారు.
★ ఒక్కొక్క రోజు ఒక సంవత్సరం తరగతులు మాత్రమే…
ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ చివరి వరకు ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రత్యక్ష తరగతులుంటాయి. ఒకరోజు ప్రథమ, మరుసటి రోజు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు తరగతులుంటాయి. విద్యార్థుల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండేలా మార్కింగ్ చేయాలని, విద్యార్థుల సంఖ్య ఆధారంగా తరగతిని షిఫ్టులుగా విభజిస్తున్నాం.
★ 80శాతం సిలబస్ ఆన్లైన్ తరగతులతోనే పూర్తి..
సెప్టెంబర్ 01 నుంచి ఆన్లైన్/డిజిటల్ తరగతులతోనే ఇంటర్ సెకండియర్ సిలబస్ దాదాపు 80శాతం పూర్తిచేశాం. మిగతా 20 శాతం సిలబ్‌సకు సంబంధించిన పాఠాలు మాత్రమే తాజాగా భౌతికంగా తరగతుల్లో బోధిస్తాం. మొత్తం 66 రోజులు తరగతులు జరుగుతాయి. ఇందులో ఫస్టియర్‌కి 33, సెకండియర్‌కి 33 రోజుల చొప్పున ఉంటాయి. సెకండియర్‌లో మిగిలిన 20శాతం సిలబస్ తో పాటు ప్రాక్టికల్స్ పరీక్షలకు ఈ సమయం సరిపోతుంది.
★ 70 శాతం సిలబస్ కే పరీక్షలు..
కేంద్ర ప్రభుత్వం సూచనతో రాష్ట్రంలోనూ 30 శాతం సిలబస్ ను తగ్గించాలని నిర్ణయించాం. CBSE నిర్ణయం మేరకు సైన్స్ గ్రూప్ సబ్జెక్టుల్లో కుదించాం. 30శాతం తగ్గించినా ఆ సిలబస్ కు విద్యార్థులకు అసైన్మెంట్ పరీక్షలు నిర్వహిస్తాం. వీటికి మార్కులు మాత్రం ఉండవు.
★ కళాశాలకు రెండు ఐసోలేషన్ గదులు..
కాలేజీకి వచ్చిన విద్యార్థుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్ గదిలో ఉంచాలని ఆదేశించాం. ఇందుకోసం ప్రతి కాలేజీలో రెండు గదులు కేటాయిస్తున్నాం. అనారోగ్యం పాలైన విద్యార్థులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పర్యవేక్షిస్తారు.
★ తరగతులు తప్పనిసరి కాదు..
విద్యార్థులు తరగతులకు హాజరవటం తప్పనిసరి కాదు. పూర్తిగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఇష్టానికే వదిలేస్తున్నాం. రావాలనుకునేవారు మాత్రం తప్పనిసరిగా తల్లిదండ్రులు సంతకం చేసిన సమ్మతి పత్రం సమర్పించాలి. కాలేజీకి రానివారు ఆన్లైన్ తరగతులకు హాజరవ్వచ్చు. ఒక్కరోజు కాలేజీకి రాకపోయినా నేరుగా పరీక్ష ఫీజు చెల్లించి వార్షిక పరీక్షలకు హాజరయ్యే అవకాశాన్ని ఈసారి కల్పిస్తున్నాం. వారందరినీ రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణిస్తాం. సైన్స్ గ్రూప్ విద్యార్థులు ప్రాక్టికల్స్ పరీక్షలకు మాత్రం హాజరు కావాల్సి ఉంటుంది. ఈసారి ప్రాక్టికల్స్ పరీక్షలకు జంబ్లింగ్ విధానం అమలుచేయాలని భావించినా.. సాధ్యపడటం లేదు. వార్షిక పరీక్షలను మాత్రం ఎప్పటిలాగే ఇతర కేంద్రాల్లో జంబ్లింగ్ విధానంలో నిర్వహిస్తాం.
★ ప్రత్యేక సప్లిమెంటరీ పరీక్ష నిర్వహిస్తాం..
గత ఏడాది సెకండియర్ పరీక్షల్లో ఫెయిలైన వారందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ, నిరుడు మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు రాసి ఫెయిలైనవారు ఉన్నారు. వారందరూ ఇప్పుడు సెకండియర్‌లో ఉన్నందున ఈసారి బ్యాక్‌లాగ్‌లను పూర్తిచేయాల్సిందే. వారికోసం ప్రత్యేకంగా సప్లిమెంటరీ నిర్వహించాలని భావిస్తున్నాం. మార్కులు తక్కువగా వచ్చినవారు ఇంప్రూమెంట్ రాయవచ్చు. పరీక్షల నిర్వహణపై ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాం. అనుమతి లభిస్తే నిర్వహిస్తాం.
★ ప్రశ్నపత్రం నమూనా మారదు..
గతంలో ఉన్నవిధంగానే ప్రశ్నా పత్రం నమూనాలో ఎలాంటి మార్పు ఉండదు. కాకపోతే ఈసారి అన్ని సెక్షన్లలో ఆప్షన్స్ ఇవ్వాలని నిర్ణయించాం. ఉదాహరణకు.. సెకండియర్ ఫిజిక్స్ ప్రశ్నపత్రంలో 60 మార్కులుంటాయి. ఇందులో సెక్షన్-ఎ లో 2 మార్కుల 10 ప్రశ్నలిస్తే అన్నిటికీ సమాధానమివ్వాల్సి ఉండేది. సెక్షన్-బి లో 4 మార్కులవి 8 ప్రశ్నలిస్తే ఆరింటికి, సెక్షన్-సి లో 8 మార్కులవి 3 ప్రశ్నలిస్తే రెండిటికి సమాధానం ఇవ్వాల్సి ఉండేది. కానీ, ఈసారి సెక్షన్-ఎ లో నూ ఆప్షన్స్ ఇవ్వబోతున్నాం. సెక్షన్-బి, -సిలలో ఆప్షన్స్‌ను మరింతగా పెంచబోతున్నాం.
ఆంధ్రజ్యోతి :: CREDITS