తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల పునఃప్రారంభం అనంతరం 300 కి పైగా విద్యార్థులు ఉన్న కళాశాలలు షిఫ్టుల వారీగా తరగతులు నిర్వహించాలన్న నిర్ణయాన్ని అధికారులు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా రెండు షిఫ్టుల్లో తరగతులు నిర్వహించాలని అధికారులు ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేశారు. అయితే దీనికి బదులుగా ఒకరోజు ప్రథమ సంవత్సరం, మరోక రోజు రెండవ సంవత్సరం విద్యార్థులకు తరగతులు నిర్వహించాలనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.
విద్యార్థుల సౌకర్యం కోసమే షిఫ్ట్ సిస్టమ్‌పై నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలిసింది. నాంపల్లిలోని రూసా సెంటర్లో సోమవారం సంక్షేమ శాఖల మంత్రులతో సమావేశంలో ఇదే ప్రతిపాదన వచ్చినట్టు తెలిసింది. విద్యార్థులంతా ప్రతిరోజు హాజరు కావాల్సి ఉంటుంది. ఇందుకు గదుల సర్దుబాటు సమస్య తలెత్తే అవకాశం ఉండటం, పైగా విద్యార్థుల్లో అత్యధికులు గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు కావడం, కాలేజీలు పట్టణాల్లో ఉండటంతో విద్యార్థులను ప్రతిరోజు కాలేజీలకు పంపించేందుకు తల్లిదండ్రులు అంగీకరించకపోవచ్చని భావిస్తున్నారు. త్వరలోనే అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
ప్రత్యక్ష బోధనతోపాటు సమాంతరంగా ఆన్లైన్ తరగతులు జరుగుతాయని వెల్లడించారు. ఇప్పటికే 86 శాతం మంది ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్నారని.. తరగతులకు హాజరుకాని వారిపై ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉండాలని సూచించారు. శానిటైజేషన్ చేసేలా స్థానిక సంస్థలు, డీపీవోలకు ఆదేశించినట్టు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో సీఎస్ సోమేశ్‌కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, ఎస్సీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, సాంకేతిక, కాలేజియేట్ విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్, పౌరసరఫరాలశాఖ కమిషనర్ వి. అనిల్‌కుమార్, ప్రవీణ్‌కుమార్, మల్లయ్యభట్టు పాల్గొన్నారు.