ప్రభుత్వ బడులకు – బడికి ఒక్క కార్మికుడిని నియమించాలి – అలుగబెల్లి

తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు 20 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం ఊడ్చడానికి, టాయిలెట్లను శుభ్రపరచడానికి మరియు తరగతి గదుల తలుపులు వేసి తాళాలు వేయడానికి తీయడానికి కనీసం ఒక కార్మికుడు కూడా అందుబాటులో లేకపోవడం విచారకరమని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు.

గత నాలుగు సంవత్సరాలుగా సమగ్ర శిక్ష పథకం కింద పాఠశాలకు ఒక కార్మికుడు ₹2500 భృతితో నియమించడం జరిగిందని అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను ఆపడంతో వారు కూడా లేకుండా పోయారని అలుగుబెల్లి విమర్శించారు.

అయితే ఈ సంవత్సరం గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నుండి కార్మికులను తీసుకొనివచ్చి పాఠశాలల్లో పని చేపించుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలు ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా ఇంతవరకు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎలాంటి కార్మికులను పాఠశాలలకు పంపడం పంపక పోవడం వలన ఈ ఉత్తర్వులకు విలువ లేకుండా పోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో పాఠశాలలను ఊడ్చడం, టాయిలెట్లను శుభ్రపరచుకోవడం, తరగతి గదులకు, గేట్లకు తాళాలు వేసుకోవడం తీసుకోవడం వంటి పనులను ఉపాధ్యాయులే చేయడం విచారకరమని అలుగుబెల్లి తెలియజేశారు.

అయితే ఫిబ్రవరి 1 నుండి పాఠశాలలు పునః ప్రారంభం కావడం వల్ల పాఠశాల స్వచ్ఛత మీద ప్రభుత్వం దృష్టి పెట్టి కార్మికులు నియమించాలని ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వ బడులలో బడికి ఒక్క కార్మికుని 5 వేల చొప్పున భృతుని కేటాయించి నియమించిన కూడా నెలకు అయ్యే ఖర్చు 10 కోట్లు మాత్రమే కానీ ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపకపోవడం వల్ల పాఠశాలలు స్వచ్ఛతకు దూరంగా ఉంటున్నాయని దాని వలన విద్యార్థులకు వివిధ రకాల వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతి కార్యాలయంలో అధికారులకు సహాయకులుగా కార్మికులు ఉంటున్నారని కానీ వందలాది మంది విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలలకు మాత్రం అన్ని పనులను చేసే సహాయకులను నియమించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ బడులకు బడికి ఒక కార్మికుడుని నియమించాలని పాఠశాలల యాజమాన్యాలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి లేఖలు రాయాలని ఆయన సూచించారు.