కోవిడ్ టీకా పంపిణీ పై కేంద్రం మార్గదర్శకాలు.

భారత్‌ దేశంలో మరికొద్ది వారాల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో టీకా పంపిణీపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.

తొలి ప్రాధాన్యం కింద కరోనా వారియర్స్ అయినా వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులతోపాటు వృద్ధులకు వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

★ కేంద్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాలు

  • వ్యాక్సిన్‌ తీసుకునే వ్యక్తి టీకా పంపిణీ కేంద్రానికి వచ్చేంతవరకు వ్యాక్సిన్‌, డైల్యుయెంట్లను వ్యాక్సిన్‌ క్యారియర్‌లో జాగ్రత్తగా పరిరక్షించాలి.
  • టీకా సెషన్‌ పూర్తయిన తర్వాత ఐస్‌ప్యాక్స్‌, ఓపెన్‌ చేయని వ్యాక్సిన్‌ వయల్స్ ఉన్న వ్యాక్సిన్‌ క్యారియర్‌ను తిరిగి కోల్డ్‌ స్టోరేజీ పాయింట్‌కు పంపించాలి.
  • ఒక్కో వ్యాక్సినేషన్‌ బృందంలో ఐదుగురు సభ్యులు ఉండాలి. ఒక టీకా కేంద్రంలో రోజుకు 100 మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలి. ఒకవేళ వ్యాక్సిన్‌ కేంద్రం పెద్దగా ఉంటే మరో వ్యాక్సినేటర్ అధికారిని ఏర్పాటు చేసి 200 మందికి వ్యాక్సిన్ ఇవ్వొచ్చు.
  • తొలి ప్రాధాన్యంలో కరోనా వారియర్స్ అయినా ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, 50 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వాలి. ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితిని బట్టి 50 ఏండ్ల‌ లోపువారికి అందించాలి. ఇటీవల జరిగిన లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తాజా ఓటర్ల జాబితా ఆధారంగా 50 ఏండ్లు పైబడిన వారిని గుర్తించాలి.
  • వ్యాక్సిన్‌ వేసే గదిలోకి ఒక్కరినే అనుమతించాలి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వారి ఆరోగ్య పరిస్థితిని 30 నిమిషాల పాటు పరిశీలించాలి.
  • వ్యాక్సిన్ పంపిణీ కోసం కేంద్రం Co-WIN వెబ్‌సైట్‌ను తీసుకురానుంది. ఇందులో ఆధార్‌కార్డు, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్ట్‌, పెన్షన్‌ డాక్యుమెంట్‌ ఇలా ఏదైనా ఒక గుర్తింపు కార్డుతో వ్యాక్సిన్ కోసం ముందస్తు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.