కరోనా కారణంగా విద్యా రంగం తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటుంది. కరోనా కారణంగా మూసివేయబడిన విద్యా సంస్థలు ఇంతవరకు పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు ఎప్పుడు తెరుచుకుంటాయో కూడా చెప్పలేని స్దితిలో ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ పద్ధతిలో విద్యాబోధన జరపాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి, సెప్టెంబర్ 1న ప్రారంభించింది. ఈ ఆన్లైన్ తరగతులు కొంతవరకు ప్రయోజనం చేకూర్చినప్పటికి గ్రామీణ, గిరిజన, మారుమూల, ప్రాంతాల విద్యార్థులను చేరలేకపోయాయి.
తాజాగా ప్రథమ్ సంస్థ దేశవ్యాప్తంగా సర్వేచేసి రూపొందించిన విద్యా వార్షిక స్థితి నివేదికను (ASER) విడుదల చేసింది.
ఈ నివేదికలోని అంశాలు
★ తల్లిదండ్రులకు భారీ ఖర్చు
● తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు డిజిటల్ బోధన కోసం టీవీలు, స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లు మరియు ల్యాప్టాప్ల కొనుగోలుకు 2,500 కోట్లు ఖర్చు చేశారు.
● 2018 ASER నివేదిక ప్రకారం 45.8 శాతం మంది విద్యార్థులకు స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉండగా 2020 నివేదిక ప్రకారం ఇది 74 శాతానికి పెరిగింది.
● ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో స్మార్ట్ఫోన్ల వినియోగం 37.6 నుండి 68.1 శాతానికి పెరిగింది.
● తెలంగాణలో 90.5 శాతం మంది విద్యార్థులకు టీవీలు, 74 శాతం విద్యార్థులకు స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
★ వేధిస్తున్న నెట్వర్క్ సమస్య
● నెట్వర్క్ సమస్యతో గ్రామీణ విద్యార్థులకు ఆన్లైన్ బోధన అందట్లేదు.
● రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు, టీవీల సంఖ్య గణనీయంగా పెరిగినా గ్రామాలు, తండాలు, మారుమూల ప్రాంతాల్లో విద్యార్థులను నెట్వర్క్ సమస్య వేధిస్తోంది.
● ఫైబర్ ఆప్టికల్ (భారత్ నెట్) ద్వారా ప్రతీ గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినా అదంతా మాటలకే పరిమితమవుతోంది.