మూతబడిన 69 డీ.ఎడ్ కళాశాలలు

తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం(2020-21)లో 171 డీఎడ్‌ కళాశాలలకు  ఏకంగా 69 ప్రైవేట్‌ కళాశాలలు మూతపడ్డాయి.  కాగా ఈసారి 102 ప్రైవేటు యాజమాన్యాలు  మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికే ముందుకు వచ్చాయని పాఠశాల విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

● కారణాలు ::

గత ఏడాది సుప్రీం కోర్టు  ప్రాథమిక తరగతులు బోధించే సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌(SGT)  పోస్టులకు B.Ed చదివిన వారూ కూడా అర్హులేనని  తీర్పునిచ్చింది. దాంతో విద్యార్థులు డీఎడ్‌ బదులు బీఈడీ చదివితే ఎస్‌జీటీతో పాటు స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు కూడా అర్హత ఉంటుందని భావిస్తున్నారు. 

ఈ నేపథ్యంలోనే గత ఏడాది డీఈఈసెట్‌కు దాదాపు 25 వేల మంది దరఖాస్తు చేయగా ఈసారి ఆ సంఖ్య దాదాపుగా 14 వేలకు తగ్గింది. 

దీంతో పాటు కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం వార్షిక పీజులను పెంచడం లేదని ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. ఈ కారణాలతోనే ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోలేదని సమాచారం.