కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల సమస్యలకు పరిష్కారం ఎప్పుడు ?

స్వరాష్ట్రం సిద్దించి కేసీఆర్ అధికారం చేపట్టిన నాటి నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు పురోగమన దిశలో నడుస్తున్నవి. ఈ కళాశాలల పురోగమనంలో కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల కృషి ప్రశంసనీయమైనదిగా చెప్పవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా గల 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దాదాపు 3800 మంది కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. వీరు దాదాపు 20 ఏండ్ల నుండి తమ బ్రతుకుకు, హోదాకు, భద్రతకు కారణమైన ఇంటర్ విద్యావ్యవస్థ పరిరక్షణకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. 

ఇంటర్ విద్యకు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్య, ఉచిత ప్రవేశం, ఉచిత పుస్తకాల పంపీణీతో పాటు, కోవిడ్ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులు వంటి  మొదలైన ప్రోత్సహలను గ్రామ గ్రామంకు తీసుకవెళుతున్నారు. వీరు ఇంటర్ వ్యవస్థను అప్రతిష్ట పాలు చేసే కుట్రలను తిప్పికొట్టడంలో ముందుంటున్నారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, కార్పొరేటు కళాశాలకు దీటుగా ఫలితాలను తీసుకవస్తున్నారు. వీరు  గ్రామీణ నిరుపేద విద్యార్థులకు తమ జీతం నుండి కొంత  ఆర్ధిక సహాయం చేస్తూ, ఇంటర్ అర్హతతో జరిగే పోటీ పరీక్షలకు మార్గనిర్దేశకత్వం చేస్తున్నారు.

వీరు ప్రతి సంవత్సరం  అడ్మిషన్స్ డ్రైవ్ లో చురుకుగా పాల్గొని పదవ తరగతి పాసైన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ప్రభుత్వం ఇంటర్ విద్యకై అందించే సౌకర్యాల గురించి అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాల సంఖ్యను గణనీయంగా పెంచుతున్నారు. వీరు విద్యార్థుల ప్రవేశాల నుండి పరీక్షల ఫలితాల వరకు నిరంతరం శ్రమిస్తున్నారు. వీరు  ఒకవైపు టీచింగ్ విధులను, మరోవైపు నాన్ టీచింగ్, ఆఫీస్ సబార్డినేటుల విధులను సైతం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల పరిరక్షణకు అన్ని వారే అయినప్పటికీ వారి సమస్యలను ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పవచ్చు.

● ఉమ్మడి రాష్ట్రంలో కష్టాలు ::

గత ఉమ్మడి ప్రభుత్వం కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు  చాలీ చాలనీ జీతాలు ఇస్తూ శ్రమ దోపిడీకి గురి చేశారు. వారి ఉద్యోగ భద్రతకు భరోసా ఇవ్వలేదు. కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల సంఘాలు  సమ్మెలు, ధర్నాలు చేసినా పెద్దగా పట్టించుకోలేదు. కాబట్టి వారి సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు ఉండేవి. ఈ తరుణంలో కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు ఎంతో ఆశపడి కెసిఆర్ నాయకత్వంలో జరిగినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి అండగా నిలిచి, విద్యార్థుల ద్వారా ఉద్యమం ఉదృతం చేశారు. అలాగే స్వరాష్ట్ర సిద్దించిన తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో  తెరాస పార్టీ ప్రచార కార్యకర్తలుగా చురుకుగా పనిచేశారు. కేసీఆర్  తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఆశపడిన కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు భంగపాటు తప్పలేదు. కేసీఆర్ అధికారం చేపట్టిన తొలియేడు(2014) కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల క్రమబద్దీకరణకై జి.వో.16ను జారీ చేయడం,2017లో సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం అనే  తీర్పుకు అనుగుణంగా  కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల వేతనం 37100కు పెంచడం,2018లో రెండవ దపా ఎన్నికలకు వెళ్లే ముందు శ్రీ తన్నీరు హరీష్ రావు   చొరవతో కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు 12నెలల వేతనం వంటి చర్యలు చేపట్టిన వీరికి సంబందించిన అనేక సమస్యలు పరిష్కరించడంలో శ్రద్ద చూపడం లేదని చెప్పవచ్చును.

కేసీఆర్ ప్రభుత్వం భావించిన విధంగా జీవో 16 ప్రకారం కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల క్రమబద్దీకరణ జరిగినట్లయితే అనేక సమస్యలు పరిష్కారం అయ్యేవి. ఈ జీవోకు వ్యతిరేకంగా కొందరు నిరుద్యోగులు కోర్టుకు వెళ్లడంతో, కోర్టు స్టే ఇవ్వడం దీనితో క్రమబద్దీకరణ నిలిచి పోవడం జరిగింది. అప్పటి నుండి కెసిఆర్ ప్రభుత్వం జీవోకు ఉన్న అడ్డంకులు తొలిగించుటకు సరైన ప్రయత్నాలు చెయ్యడం లేదన్న విషయం కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల సంఘాల నుండి బలంగా వినిపిస్తుంది. అంతేకాక  ఇప్పట్లో కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల క్రమబద్దీకరణ చేసే  ఆలోచన ప్రభుత్వంకు లేదని విమర్శలు కలవు. కాబట్టి కెసిఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధితో    కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల సంబంధించిన  ఈ క్రింద పేర్కొనబడిన సమస్యల పరిష్కారంకు వేంటనే చొరవ చూపాలి.

●  బదిలీలు :: 

పరిపాలన దృష్ట్యా కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు బదిలీలు ఉండవు అని ఉన్నతాధికారులు ప్రభుత్వంను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పవచ్చును. గతంలో ఉన్నతాధికారుల చొరవ వల్లనే కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు బదిలీలు జరిగిన మాట వాస్తవమే. అంతేకాకుండా సోషల్ వెల్ఫేర్, బిసి వెల్ఫేర్ మొదలైన జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు జరుగుతున్నవి. కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు మాత్రం బదిలీలు జరగడం లేదు. కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు కుటుంబ పరమైన, ఆర్ధిక పరమైన, అనారోగ్య పరమైన కారణాలు దృష్ట్యా బదిలీలు జరుపాలనీ గత 10 యేండ్ల నుండి ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు మొర పెట్టుకున్న వారి మనస్సు కరగపోవడం శోచనీయం. బదిలీలు జరగపోవడం వలన ఆందోళన గురై అనేక మంది కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు గుండెపోటుతో మరణిస్తున్నారు. వీరి బదిలీల మనోవేదన కూడ విద్యార్థులపై ప్రభావం చూపే అవకాశం కలదు. ఇకనైనా కెసిఆర్ ప్రభుత్వం మానవత్వ దృక్పధంతో తక్షణమే బదిలీలు జరిపి తీరాల్సిందే. 

● నెల నెల వేతనం ::

ప్రైవేటు పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ప్రతి నెల ఒకటవ తేదీన వేతనం వస్తుందని నమ్మకం ఉంటుంది. కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేసే కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు ప్రతి నెల ఒకటవ తేదీన వేతనం వస్తుందన్న నమ్మకం లేదు. వేతనం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి వీరిది. గతంలో కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు ప్రతి నెల ఒకటవ తేదీన వేతనం ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన, దీని అమలు చేయడంలో అధికారుల అలసత్వం వలన అవి అమలుకు నోచుకోవడం లేదు. కావున రెగ్యులర్ ఉద్యోగుల వలె వీరికి కూడా ప్రతి నెల ఒకటవ తేదీన  వేతనం చెల్లించేలా ప్రభుత్వం చొరవ చూపవల్సిన  అవసరం ఎంతైనా ఉంది.         

● డిస్ట్రిక్ట్ యావరేజి :: 

కాంట్రాక్టు వ్యవస్థ ఆవిర్భావం నాటి నుండి నేటి వరకు ఏ ప్రభుత్వమైనా ఇతర పద్ధతిలో నియమాకం అయినా లెక్చరర్లకు లేని షరతులను ఒక  కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లపై అమలు చేస్తున్నవి. పరీక్ష ఫలితాల్లో జిల్లా సరాసరి ఉత్తీర్ణత శాతం ఉండాలన్న నిబంధనను విధిస్తున్నవి. గతంలో ఏ మాత్రం డిస్ట్రిక్ట్ యావరేజ్ తగ్గిన వారికి రెన్యువల్ చెయ్యక పోవడం వలన అనేక మంది కాంట్రాక్టు లెక్చరర్ల కుటుంబాలు రోడ్డున పడ్డ సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం  కాలంలో  తాము ఏమి చెయ్యని తప్పుకు తలవంచుకొని అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేసుకొని రెన్యువల్ తీసుకోవల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వ కళాశాలలో చదివే పిల్లలు ఎక్కువ వెనుక బడిన కులాలు చెందిన వారే ఉంటారు. వారు తరగతులకు సరిగ్గా రాకపోవడం వలన కొందరు లెక్చరర్లు డిస్ట్రిక్ట్ యావరేజ్ సాధించలేక పోతున్నారు. ఇది కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల ప్రతిభను శంకించే చర్యలా ఉంది. ఇంటర్ వ్యవస్థలోని బోధన సిబ్బందిలో ఎవరికీ లేని డిస్ట్రిక్ట్ యావరేజ్ నిబంధన కాంట్రాక్టు లెక్చరర్ల పై పెట్టడం నిజంగా వివక్షతగా భావించవచ్చు. ఈ నిబంధన కాంట్రాక్టు లెక్చరర్లకు మెడ మీద కత్తిలాంటిదిగా పేర్కొనవచ్చును.

 ● డిఏ మరియు హెచ్ ఆర్ ఏ :: 

ఉమ్మడి ప్రభుత్వ కాలంలో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు చాలీచాలని జీతాలతో పనిచేయడం వలన  ఆర్థికంగా చితికిపోయారనీ  చెప్పవచ్చును. సమైక్యవాదుల వీరిని  శ్రమదోపిడికి గురిచేశారు. ప్రస్తుతం స్వరాష్ట్రంలో  సమాన పనికి సమాన వేతనం పొందుతున్నప్పటికీ,  వీరి పిల్లలు పెద్దవారు కావడం వలన కుటుంబపోషణ భారంగా మారింది. కాబట్టి కెసిఆర్ ప్రభుత్వం డిఏ, హెచ్ ఆర్ ఏ  చెల్లించాలి. అలాగే రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు మధ్యంతర భృతి, పిఆర్ సి  అమలయ్యేలా చేసి ఆర్ధికంగా ఆదుకోవాలని  వేడుకుంటున్నారు.

 ● సాధారణ సెలవులు ::

కార్మిక ఉపాధి చట్టాల ప్రకారం ఏ ఉద్యోగి అయినా ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలలో సంవత్సరం కాలం పని చేస్తే ఖచ్చితంగా 30 సాధారణ సెలవులు ఉండాల్సిందే. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు 12 నెలలు జీతం తీసుకున్నప్పటికీ వీరికి 10 సాధారణ సెలవులు మాత్రమే కలవు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని కనీసం 24 సాధారణ సెలవులను మంజూరు చేయాలని కోరుతున్నారు.

 ● ప్రసూతి సెలవులు :: 

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్న మహిళా  కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు తీవ్రమైన వివక్షతకు గురవుతున్నారు వీరికి ప్రసూతి సెలవులు లేకపోవడం వలన కొందరు మహిళా అధ్యాపకులు తమ మాతృత్వంను  వాయిదా వేసుకుంటున్నారు. ఇకనైనా ప్రభుత్వ పెద్దలు, అధికారులు మహిళ లెక్చరర్లపై గౌరవంతో వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను తక్షణమే మంజూరు చేయాలి.

● త్వరితగతిన రెన్యువల్ మరియు బడ్జెట్ ఉత్తర్వులు ::

గడిచిన 20 ఏళ్ల కాలంలో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు సంబంధించిన రెన్యువల్ జీవో  విద్యా సంవత్సరం  ప్రారంభ తేది కన్నా ముందు వచ్చిన దాఖాలాలు లేవు.  వీరి రెన్యువల్ జిఓ విషయంలో పరిపాలన సంబంధిత అధికారులు తీవ్రమైన వివక్షతను చూపుతున్నారు అనడంలో సందేహం లేదు. ఉదాహరణకు ఒక ప్రిన్సిపాల్ రిటైర్ అయిన లేదా మెడికల్ లీవ్ పెట్టినా అతని స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగించుటకు సంబంధించిన  ఉత్తర్వులు త్వరగా జారీ చేస్తారు. కానీ ఇదే వ్యవస్థలో పని చేస్తున్న 3800 మంది  కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల రెన్యువల్ విషయంలో త్వరగా ఉత్తర్వులు జారీ చేయరు. అలాగే వారి బడ్జెట్ కు సంబంధించిన ఉత్తర్వులు త్వరగా విడుదల చేయరు. ఇంటర్ వ్యవస్థలో 75% ఉన్నా ఒప్పంద ఉద్యోగుల సమస్యలకు పరిష్కారంకు చొరవ చూపని  అధికారులు 25 శాతం ఉన్న రెగ్యులర్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఎందుకు చొరవ చూపుతున్నారు అర్థం కావడం లేదు. ఇకనైనా  త్వరితగతిన రెన్యువల్ మరియు బడ్జెట్ ఉత్తర్వులు జారీ చేసి, వారి మనోవేదనను  తీర్చవలసిన అవసరం ఎంతైనా ఉంది.

కారుణ్య నియామకం :: 

ఇటీవల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కొందరు  కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల విధి నిర్వహణలో తమ ప్రాణాలు కోల్పోయినారు. అలాగే కొందరు కళాశాలకు, అడ్మిషన్స్ డ్రైవ్, స్పాట్ వంటి క్యాంపులకు వేళ్ళుతు   రోడ్డు ప్రమాదంకు గురై మరణించినారు. వీరు మరణం వలన పెద్ద దిక్కును కోల్పోయి వారి కుటుంబ సభ్యులు రోడ్డు మీద పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మిగతా లెక్చరర్ల మనోవేదనకు గురైతున్నారు. కావున మానవత దృక్పధంతో ప్రభుత్వ పెద్దలు, అధికారులు విధి నిర్వహణలో మరణించిన కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల కుటుంబ సభ్యులలో ఒకరికి కారుణ్య నియమాకం క్రింద ఉద్యోగం కల్పించి, ఎక్స్ గ్రేషియా క్రింద కొంత నగదు అందేలా చర్యలు తీసుకోవాలి.

 ● హెల్త్ కార్డులు :: 

ప్రభుత్వ సంస్థలలో మరియు కార్పొరేషన్లలో పనిచేస్తున్న రెగ్యులర్ మరియు ఒప్పంద ఉద్యోగులకు ఇచ్చిన మాదిరిగానే కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు   ప్రభుత్వం తక్షణమే హెల్త్ కార్డులు అందించాలి. అలాగే ఇటీవల అనేక మంది కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల విధి నిర్వహణ వలన  కోవిడ్ గురై అనారోగ్యంతోపాటు ఆర్ధిక ఇబ్బందులకు లోనవుతున్నారు. వీరికి వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేసి ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వం పై కలదు. 

 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే బడుగు, బలహీన వర్గాల పిల్లల భవిష్యత్ కు బంగారు బాటలు వేస్తూ, తమ జీవితాలను త్యాగం చేస్తూ, తమ పిల్లల భవిష్యత్కు ఎలాంటి భరోసా లేకుండానే   కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల కాలం వెల్లదిస్తున్నారు. అలాగే కెసిఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల అభివృద్ధికి కృషి చేస్తూ బంగారు తెలంగాణ పునర్మిణంకు తమ వంతు కృషి చేస్తున్నారు. ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాల ద్వారా సబ్బండ వర్ణాలకు న్యాయం చేస్తున్న కేసీఆర్ కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల కూడ న్యాయం చేస్తారని తెలంగాణ సమాజం భావిస్తుంది.  కెసిఆర్ ప్రభుత్వం కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లను పట్టించుకోని ఉద్యోగ భద్రత కల్పించాలని,  లేని పక్షంలో ఆర్థిక భారం లేని  వారి సమస్యలను వీలైనంత త్వరగా  పరిష్కారించాలని 3800 కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల కుటుంబాలు ప్రాధేయ పడుతున్నవి.లేని పక్షంలో కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల సంఘాలు  తమ సమస్యల పరిష్కారం పోరాట మార్గం ఎంచుకునే అవకాశం మెండుగా ఉంది. దీనితో  ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భోధన కుంటూపడి బడుగు బలహీన వర్గాల పిల్లలు నాణ్యమైన విద్యకు దూరం అవుతారని మేధావులు హెచ్చరిస్తున్నారు. 

● వ్యాసకర్త :: 

డా.పోతరవేని  తిరుపతి, 

ప్రధాన కార్యదర్శి, 

కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల సంఘం, 

జగిత్యాల   9963117456