హైదరాబాద్ (మే – 04) : తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 1,331 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు (,contract jobs regularization In medical department) జారీ చేసింది. ఏడు విభాగాల్లో ఉద్యోగులను క్రమబద్దీకరిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తర్వులను ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అందజేశారు.
మొత్తం 40 విభాగాల్లో 5,544 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తూ ఏప్రిల్ 30వ తేదీన ఆర్థిక శాఖ ఉత్తర్వులు విడుదలైన సంగతి తెలిసిందే. నూతన సచివాలయం ప్రారంభోత్సవం అనంతరం సీఎం కేసీఆర్ తన చాంబర్‌లో ఆసీనులై కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ దస్త్రంపై సంతకం చేసిన విషయం విదితమే. దీంతో ఆయా విభాగాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ఆయా శాఖలు ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఉన్నత విద్యాశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు వెలువడిన విషయం తెలిసిందే.